వరంగల్ హంటర్ రోడ్డులోని ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (FCIMS)కి చెందిన గుర్తింపును జాతీయ వైద్య కమిషన్ (NMC) రద్దు చేసింది. అనుమతి కోసం అక్రమ మార్గాల్లో నడిచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మెడికల్ కాలేజీకి 2023లో NMC నుండి అనుమతి లభించింది. అప్పటి నుంచి మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి 300 మంది విద్యార్థులు అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం (2025-26)లో కొత్తగా ప్రవేశించే అభ్యర్థుల కోసం ఉన్న 150 సీట్లు ఈ రద్దుతో కోల్పోనున్నాయి.
NMC ప్రతినిధులు కళాశాల వసతులు పరిశీలించేందుకు వచ్చిన సమయంలో, కళాశాల ట్రస్టీ జోసెఫ్ కొమ్మారెడ్డి ద్వారానే రెండు విడతలుగా ₹66 లక్షల లంచం చెల్లించినట్టు CBI కేసు నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో NMC కళాశాల గుర్తింపును రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
వైద్య వర్గాల ప్రకారం, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులపై ఎలాంటి ప్రభావం ఉండదని వారు తెలిపారు. బోధన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 30 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండగా, వాటిలో 2 కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారాయి. తాజా పరిణామంతో, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మిగిలిన 27 కాలేజీల్లో సీట్లకు మాత్రమే అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనుంది.
ఇక ఫాదర్ కొలంబో కాలేజీ యాజమాన్యం మాత్రం, "మేము NMCని ఒప్పించి మళ్లీ అడ్మిషన్లు పొందే ప్రయత్నం చేస్తున్నాం" అని చెబుతోంది