హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా ధూల్‌పేటలో విగ్రహాల కొనుగోలు, తరలింపు విపరీతంగా పెరుగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఆగస్టు 23 నుంచి 27 వరకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

గాంధీ విగ్రహం–భోగుడా కామన్ మధ్య సాధారణ వాహన రాకపోకలను నిలిపివేస్తారు. ఈ మార్గంలో కేవలం వినాయక విగ్రహాలు తీసుకెళ్తున్న వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. గాంధీ విగ్రహం లేదా పూరానపూల్ నుంచి మంగళహాట్ వైపు వెళ్తున్న వారు టక్కర్వాడి–జిన్సీ చౌరస్తా–ఘోడ్‌కే ఖబర్ మార్గాన్ని ఉపయోగించాలి. సీతారాంబాగ్ నుంచి మంగళహాట్ లేదా పూరానపూల్ వెళ్తున్న వారు కార్వాన్ రోడ్ లేదా దరుస్సలాం–ఎంయే బ్రిడ్జ్ మార్గాలను అనుసరించవచ్చు.

భారీ వాహనాలు మాత్రం జూమెరాత్ బజార్ గ్రౌండ్ లేదా 100 అడుగుల రోడ్డులో పార్క్ చేయాల్సి ఉంటుంది. ఇవి రాత్రి 10 గంటల తర్వాత మాత్రమే రాకపోకలకు అనుమతిస్తారు. వర్షం పడ్డా MJ బ్రిడ్జ్ నుంచి జూమెరాత్ బజార్ వరకు ఒకే వరుసలో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారు.

కాబట్టి వాహనదారులు ఈ ఆంక్షలను గమనించి ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పండుగను అందరూ సురక్షితంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.