వరలక్ష్మి వ్రతం హిందూ సంప్రదాయంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం. ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు. 2025లో వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8వ తేదీ, శుక్రవారం నాడు వస్తుంది.
వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత
వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించడం ద్వారా అష్టలక్ష్మీ ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధనం, ధాన్యం, ఆయుష్షు, ఆరోగ్యం, సంతానం, విజయం, కీర్తి ప్రతిష్టలు, శాంతి, ఆనందం, శక్తి వంటి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు, భర్త ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్టతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కాంద పురాణం చెబుతోంది.
వరలక్ష్మి వ్రతం పూజా విధానం
వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజున పాటించాల్సిన పూజా విధానం కింద ఇవ్వబడింది:
1. పవిత్రత ముఖ్యం:
- వ్రతం ఆచరించే రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలి.
- ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి.
- గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, గడపలకు పసుపు, కుంకుమ పెట్టుకోవాలి.
2. మండపం ఏర్పాటు:
- పూజ గదిలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
- బియ్యపు పిండితో అందమైన ముగ్గు వేయాలి.
3. కలశ స్థాపన:
- మండపంపై కలశాన్ని (ఇత్తడి లేదా వెండి పాత్ర) స్థాపించాలి.
- కలశంలో నీరు లేదా బియ్యం పోసి, తమలపాకులు, నాణేలు, పసుపు, కుంకుమ వేయాలి.
- కలశంపై కొబ్బరికాయ ఉంచి, పసుపు, కుంకుమ పూయాలి.
- అమ్మవారి విగ్రహాన్ని లేదా పటాన్ని కలశం వెనుక ప్రతిష్టించి, చీర, నగలు, పువ్వులతో అందంగా అలంకరించాలి.
4. పూజా సామాగ్రి సిద్ధం:
- పూజకు కావాల్సిన వస్తువులన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి:
- పసుపు, కుంకుమ, గంధం
- విడిపూలు, పూల మాలలు
- తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు
- అగరబత్తీలు, కర్పూరం
- చిల్లర పైసలు (నాణేలు)
- తెల్లని వస్త్రం (కలశానికి)
- బ్లౌస్ పీసులు (వాయనం ఇవ్వడానికి)
- మామిడి ఆకులు, అరటిపండ్లు, ఇతర రకాల పండ్లు (కనీసం 5 రకాలు)
- అమ్మవారి ఫోటో లేదా విగ్రహం
- కొబ్బరి కాయలు (3)
- తోరాలు: తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని పసుపు రాసి, దానికి ఐదు లేదా తొమ్మిది పూలతో ముడులు వేసి తోరాలను తయారు చేసుకోవాలి.
- ఇంట్లో తయారుచేసిన నైవేద్యాలు (పిండి వంటలు, పాయసం, వడపప్పు, పానకం, పరమాన్నం మొదలైనవి)
- బియ్యం, పంచామృతాలు (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర కలిపి)
- దీపాలు, గంట, హారతి ప్లేటు, స్పూన్లు, ట్రేలు, నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, బౌల్స్.
5. పూజా క్రమం:
- పసుపు గణపతి పూజ: ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి. పూజ నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాలి.
- శ్లోకం: "శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే." అంటూ గణపతిపై అక్షతలు చల్లి పూజ చేయాలి.
- పుణ్యాహవచనం: ఇంటిని, పూజా సామాగ్రిని పవిత్రం చేయడానికి పుణ్యాహవచనం చేయాలి.
- కలశ పూజ: కలశంలోని దేవతలను ఆవాహన చేసి పూజించాలి.
- వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి: అమ్మవారిని అష్టోత్తర శతనామావళి లేదా ఇతర స్తోత్రాలతో పూజించాలి.
- అంగపూజ: అమ్మవారి వివిధ అంగాలను పూజించాలి.
- ధూప, దీపాలు: అగరబత్తీలు వెలిగించి, దీపారాధన చేయాలి.
- నైవేద్యం: లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలు, పాయసం, వడపప్పు, పానకం మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి.
- తోరాల పూజ: ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను పూజించి, ఒక తోరాన్ని కుడిచేతికి కట్టుకోవాలి.
- కథా శ్రవణం: వరలక్ష్మీ వ్రత కథను చదవడం లేదా వినడం ఎంతో ముఖ్యం. కథ విన్న తర్వాత అక్షతలు శిరసుపై వేసుకోవాలి.
- మంత్ర పుష్పం, ప్రదక్షిణ: మంత్ర పుష్పం సమర్పించి, ఆత్మప్రదక్షిణ చేయాలి. "ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి" అంటూ తాంబూలం సమర్పించాలి.
- వాయనం: పూజ పూర్తయిన తర్వాత, ముత్తైదువులకు పసుపు, కుంకుమ, చీర, గాజులు, శనగలు, కుడుములు వంటి వాయనాలను ఇవ్వాలి. వారిని మహాలక్ష్మిగా భావించి ఆశీర్వాదం తీసుకోవాలి.
వరలక్ష్మి వ్రత కథ
ఒకానొకప్పుడు పరమేశ్వరుడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా, నారద మహర్షి, ఇంద్రాది దేవతలు ఆయనను కీర్తిస్తున్నారు. ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి, "నాథా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి" అని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు "దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలి" అని చెప్పాడు.
పార్వతీదేవి "దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు?" అని అడుగగా, పరమేశ్వరుడు ఒక కథ చెప్పాడు. పూర్వం మగధ రాజ్యంలో కుండిన నగరం అనే పట్టణం ఉండేది. అది బహు సుందరమైన పట్టణం. అందులో చారుమతి అనే ఒక సాధ్వి ఉండేది. ఆమె సద్గుణ సంపన్నురాలు. ఆమె సద్గుణాలకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నంలో ప్రత్యక్షమైంది.
లక్ష్మీదేవి చారుమతితో, "చారుమతీ! నీ సద్గుణాలకు నేను మెచ్చాను. నీకు కావలసిన వరములను ఇస్తాను. నీవు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు" అని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి నిద్ర లేచి, అది కలగా గుర్తించి తన భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు కూడా చారుమతి కలను గురించి విని, పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.
ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.