నిన్న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) విడుదల చేసిన లేఖలో పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాలను గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించాలని చేసిన డిమాండ్‌ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

ప్రస్తుతం గ్రామ–వార్డు సచివాలయ సిబ్బంది ఇప్పటికే అనేక సర్వేలతో, పనులతో మునిగిపోయి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. హేతుబద్ధీకరణ అనంతరం మరింతగా పని భారం పెరిగింది. ఈ పరిస్థితుల్లో విద్యాశాఖ బోధనేతర పనులను మాపై మోపడం అన్యాయం మాత్రమే కాక దుర్మార్గం కూడా.

ఇప్పటికే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు & వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు వారానికి రెండు సార్లు పాఠశాలల్లోని మరుగుదొడ్లను తనిఖీ చేసి ఫోటోలు తీసి IMMS యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఉపాధ్యాయుల బోధనేతర పనులను తగ్గించాలంటే వారు ప్రభుత్వాన్ని నేరుగా సంప్రదించి పరిష్కారం కోరుకోవాలి. కానీ, ఆ భారాన్ని గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులపై మోపడం తీవ్ర అన్యాయం.

సచివాలయ ఉద్యోగుల్లో కొంతమంది విద్యాశాఖలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారిని విలీనం చేసే అవకాశంపై ప్రభుత్వం ఆలోచించాలి. కానీ అన్ని పనులు సచివాలయ సిబ్బందిపైనే మోపడం సరైంది కాదు.

మా డిమాండ్:
👉 వెంటనే గ్రామ–వార్డు సచివాలయ సిబ్బందికి కేటాయించిన పాఠశాల మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేసే విధులను రద్దు చేయాలి.
👉 సచివాలయ ఉద్యోగులను చులకనగా చూడకుండా, వారి గౌరవాన్ని కాపాడే చర్యలు ప్రభుత్వం & ఉపాధ్యాయ సంఘాలు తీసుకోవాలి.