తెలుగు రాష్ట్రాల్లో సహజ జలవనరులైన కృష్ణా, గోదావరి నదులపై మిగులు జలాల పరిరక్షణ ఎంతో కీలకమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం నాడు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఈ రెండు నదుల్లో మిగులు జలాలు 2000 టీఎంసీలకు పైగా ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి కేంద్రం కమిటీని వేసినప్పటికీ, "గడ్డపారం నానబెట్టినట్టు ఈ కమిటీని నానబెట్టొద్దు" అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నీటి సమస్యపై చర్చించేందుకు ముందుకు రావడం సానుకూల పరిణామమని, సీపీఐ పార్టీగా మేము కూడా అదే కోరుకుంటున్నాం అని అన్నారు.

నదీ జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, సాధనతోనే సాధ్యం సాధ్యమవుతుందని నారాయణ అభిప్రాయపడ్డారు. "ఏ ప్రాజెక్టు కట్టాలి, ఏది వద్దు" అనే అంశం కంటే ముందుగా, మిగులు జలాలపై స్పష్టత రావాలనీ అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధిత సమస్యలు, అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. 1950 నుండి రాయలసీమకు నీరు కావాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని గుర్తుచేశారు.

కేసీఆర్ నాయకత్వంపై స్పందించిన నారాయణ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సెంటిమెంట్ పూర్తయిపోయిందని, టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన నాటినుంచి ఆ సెంటిమెంట్ మాయమైందని విమర్శించారు. మొదటి క్యాబినెట్లో పని చేసిన 12 మంది మంత్రులూ ఒకప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించారు.

ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యానించిన ఆయన, "రేవంత్ పొట్టోడు కానీ గట్టోడు కానీ" అంటూ వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబు – రేవంత్ రెడ్డి లను గురు శిష్యులు అన్నట్టుగా పేర్కొన్నారు.

పోలవరం అంశంపై మాట్లాడిన నారాయణ, నీళ్లను రాజకీయంగా వాడుకోవడం తల్లిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడమే అని అన్నారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు వ్యవసాయానికి నీళ్లు అందించాలన్నదే తమ కోరిక అని స్పష్టంచేశారు.

ప్రాజెక్టుల పట్ల సీపీఐ పార్టీ సానుకూలంగా ఉందని ఆయన మరోసారి చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన జలయజ్ఞానికి స్వాగతం పలికామన్నారు. కాళేశ్వరం అవినీతిపై నిర్దాక్షిణ్యంగా నిలబడ్డామని పేర్కొన్నారు. బనకచర్ల అంశంపై కూడా చంద్రబాబుకు అప్పట్లో సలహాలు ఇచ్చామని తెలిపారు.