విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చిన్నగుడబ గ్రామ సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శీర రాఘవ (26) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా, ఆదివారం ఉదయం ఆయన మృతిచెందారు.

రాఘవపై మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన రూ.4.95 లక్షలు బకాయి ఉండగా, రైతుల వద్ద నుంచి కూడా సుమారు రూ.3.50 లక్షలు అప్పు తీసుకున్నట్లు సమాచారం. ఈ మొత్తాలను తిరిగి చెల్లించలేక ఒత్తిడి పెరగడంతో మానసిక ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రాఘవ గతంలో ఆన్‌లైన్ బెట్టింగుల కారణంగా అప్పుల్లో కూరుకుపోయి సస్పెన్షన్‌కు గురయ్యారని సహచరులు చెబుతున్నారు. ఆయన మృతికి దానికి కూడా సంబంధం ఉందని చర్చ నడుస్తోంది.