గుంటూరు జిల్లా తురకపాలెంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “ప్రజల ప్రాణాలతో ఆటలాడే పరిస్థితి ఉండకూడదు. వైద్య శిక్షణ పొందిన వారికే పూర్తి స్థాయి వైద్యం చేసే అధికారం ఉంది. RMPలు (Registered Medical Practitioners) కేవలం ప్రాధమిక చికిత్స వరకే పరిమితం కావాలి. అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే ప్రాథమిక చికిత్స చేయగలరు. కానీ దీన్ని మించి ఆపరేషన్లు, పెద్ద చికిత్సలు చేస్తే తీవ్రమైన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

శ్రీహరి స్పష్టం చేస్తూ – “ప్రజలు కూడా జాగ్రత్త వహించాలి. అనుమతులు లేని వ్యక్తుల వద్ద చికిత్స తీసుకోవద్దు. లేని పక్షంలో అనవసరమైన ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంది” అన్నారు.

అలాగే, స్థానికంగా అనుమతులు లేని RMPలు యాంటీబయాటిక్స్ వాడటం, పెద్ద రకాల మందులు ఇవ్వడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. “లైసెన్స్ లేకుండా RMPలు మందులు ఇస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టంగా తెలిపారు.

తురకపాలెం పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలకు మెడికల్ కౌన్సిల్ చైర్మన్, IMA ప్రతినిధులు అవగాహన కల్పించారు.