ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాకు రానున్నారు. ఉదయం 7.50కు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి, ఉదయం 10.20కు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలానికి బయల్దేరి, ఉదయం 11.10కు భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కి చేరుకుంటారు.

ఉదయం 11.45కు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.40కు సుండిపెంట హెలిప్యాడ్‌ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు ప్రయాణిస్తారు. మధ్యాహ్నం 2.30కు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ ప్రాజెక్ట్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

సాయంత్రం 4 గంటల వరకు జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం 4.15కు రోడ్డుమార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకుని, అక్కడి నుంచి సాయంత్రం 4.40కు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ నుంచి దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి.