అమరావతి, ఆగస్టు 20:
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పిఆర్సి, డిఏ, బకాయిలపై ఎలాంటి స్పష్టత లేకపోవడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.
రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో 12వ పిఆర్సి అమలు, 11వ పిఆర్సి బకాయిలు, 4 డిఏలు, ఇతర పెండింగ్ సమస్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని యుటిఎఫ్ విమర్శించింది. 25 నెలల క్రితమే 12వ పిఆర్సి కమిటీ నియమించాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికీ దానిపై హామీ ఇవ్వకపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది.
అలాగే, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57ను రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొత్త పెన్షన్ విధానంలోనే కొనసాగుతున్నారని తెలిపారు. వెంటనే మెమో 57 అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.