విజయవాడ నగరంలో డయేరియా కేసులు నమోదవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ పరిపాలన శాఖ మంత్రి నారాయణ, వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్రతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. 57వ డివిజన్ న్యూ ఆర్ ఆర్ పేటలో డయేరియా కేసులు నమోదయ్యాయని, బాధితులు ప్రస్తుతం కొత్త ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కమిషనర్ మంత్రికి వివరించారు. అందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.

ప్రాథమికంగా కార్పొరేషన్ తాగునీటిలో కలుషితత కనిపించలేదని కమిషనర్ స్పష్టం చేశారు. అయితే, తాగునీటి శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కి పంపినట్లు తెలిపారు. పూర్తి స్థాయి రిపోర్టులు వచ్చేవరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా, న్యూ ఆర్ ఆర్ పేట ప్రాంతానికి కార్పొరేషన్ తాగునీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలని, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంలో ఎటువంటి లోటు లేకుండా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా, స్థానికంగా అవసరమైన వైద్య సేవలు నిరంతరం అందేలా పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.