కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామానికి చెందిన భాను ప్రకాష్, జేఎన్టీయూలో ఎంసీటెక్ చదువుతూ విద్యార్థిగా మాత్రమే కాకుండా ఇన్నోవేటర్‌గా కూడా తన ప్రతిభను చూపిస్తున్నాడు. సాధారణ విద్యార్థుల కంటే భిన్నంగా ఏదో సరికొత్తగా చేయాలనే తపనతో, సోలార్ వెహికల్స్, హ్యూమన్ హైబ్రిడ్ వెహికల్స్, చార్జింగ్ సపోర్ట్ వాహనాలను డిజైన్ చేసి కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు.

సూర్యుడు ఉన్నంత వరకు వాహనం కదిలే విధంగా ప్రత్యేకమైన డిజైన్ రూపొందించగా, ట్రైన్‌లకు ఉన్న ఎలక్ట్రిక్ వైర్ సిస్టమ్‌లాగే రోడ్లపై టూ వీలర్స్, త్రీ వీలర్స్ కోసం కూడా కొత్త కాన్సెప్ట్‌ను ప్రతిపాదించాడు. ఈ వాహనాల్లో ఇద్దరు నుంచి ముగ్గురు కూర్చునేలా డిజైన్ చేయడంతో పాటు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని భాను చెబుతున్నాడు.

పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా సహజసిద్ధంగా నడిచే ఈ వాహనాలు పర్యావరణానికి హాని కలిగించవు. మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా వీటివల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయన అభిప్రాయం. ఇప్పటివరకు సాధారణ వస్తువులతో మోడల్స్ తయారు చేసినా, పెట్టుబడులు లభిస్తే మరింత ఆధునికంగా అప్‌డేట్ చేయగలనని అంటున్నాడు.

దేశానికి ఉపయోగపడే టెక్నాలజీని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, తగిన సపోర్ట్ వస్తే మరిన్ని పరిశోధనలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని భాను ప్రకాష్ తెలిపాడు.