పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరట కలిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ (Income Tax Returns) ఫైలింగ్ గడువును ఒకరోజు పాటు పొడిగించింది. ఆదాయపు పన్ను పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా చాలా మంది చివరి రోజు అయిన నిన్న రిటర్నులు సమర్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనితో పన్నుశాఖ గడువును ఒకరోజు పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పన్ను చెల్లింపుదారులు నిర్ణయించిన కొత్త తేదీ(సెప్టెంబర్ 16) వరకు తమ రిటర్నులు సమర్పించుకునే వీలు ఉంటుంది.
అయితే, గడువు 30 వరకు పెంచారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలు పూర్తిగా అసత్యం. పన్నుశాఖ ఈ రకమైన వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలనే ఆధారంగా తీసుకోవాలని స్పష్టంచేసింది. ఒకరోజు పొడిగింపు తప్ప మరే ఇతర సడలింపులు లేవని కూడా తెలిపింది.
ప్రతి సంవత్సరం గడువు సమీపిస్తే చివరి రోజుల్లో ఎక్కువ మంది పోర్టల్‌లో లాగిన్ అవ్వడంతో సాంకేతిక సమస్యలు తలెత్తడం సహజమే. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురవడంతో అదనంగా ఒకరోజు సమయం ఇచ్చారు. కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఆలస్యం చేయకుండా వెంటనే ఐటీఆర్ దాఖలు చేయడం మంచిది.