అమరావతి:
రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు పరీక్షల ఆధారంగా నిర్ణయించబడనున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

కొత్తగా చేపట్టే నియామకాలలో ఐటీ నైపుణ్యం కనీస అర్హతగా పరిగణించనున్నట్టు తెలిపారు. ఉద్యోగంలో చేరిన తర్వాత శిక్షణ ఇవ్వడం కష్టమవుతుందని, అందువల్ల నియామకాల దశలోనే అభ్యర్థులు అవసరమైన స్కిల్స్ కలిగి ఉండాలని సూచించారు.

ఉపాధ్యాయులకూ ఐటీపై అవగాహన అవసరమని పేర్కొన్న ఆయన, "ఎవేర్ 2.0" ద్వారా ఇప్పటికే 42 విభాగాల డేటా రియల్‌టైమ్‌లో అందుబాటులో ఉందని చెప్పారు. మరో రెండు నెలల్లో డేటా లేక్ ప్రారంభం కానుందని, దీని ద్వారా పాలనా ప్రక్రియలు మరింత పారదర్శకంగా మారుతాయని తెలిపారు.

అలాగే, అన్ని ఫైళ్లను ఆన్లైన్లో ఉంచి వాటి ఎకౌంటబులిటీ కోసం బ్లాక్‌చైన్ టెక్నాలజీను వినియోగించనున్నట్టు చెప్పారు. ఎవరు తప్పు చేసినా క్షణాల్లో గుర్తించే అవకాశం ఉంటుందని అన్నారు.

భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీతో పాటు అనుబంధ సాంకేతికతలను రాష్ట్ర పాలనలో అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సాంకేతికతలు రాష్ట్రానికి గేమ్‌చేంజర్ అవుతాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.