ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి భారీ నిధులు కేటాయింపయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రాష్ట్రానికి మొత్తం రూ.1,120 కోట్లను విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ నిధులను మంగళవారం నుంచి స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ నిధుల కేటాయింపు పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు వర్తిస్తుంది. మొత్తం నిధుల్లో 70 శాతం గ్రామ పంచాయతీలకు, 20 శాతం మండల పరిషత్తులకు, 10 శాతం జిల్లా పరిషత్తులకు చేరనున్నాయి.
2024–25 ఆర్థిక సంవత్సరంలో రెండో విడత నిధులుగా ఇవి విడుదల అవుతున్నాయి. ప్రభుత్వం ఈ నిధులను గ్రామీణాభివృద్ధి, శానిటేషన్, తాగునీటి సరఫరా, వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి ప్రజా అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది.
ఇప్పటికే సెప్టెంబర్ 1న మొదటి విడత నిధులు విడుదల కాగా, ఇప్పుడు రెండో విడత నిధులు విడుదల కావడం స్థానిక సంస్థలకు ఊపిరి పీల్చేలా చేస్తుందని అధికారులు వెల్లడించారు.