ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం, "జీరో ఫేర్ టికెట్" అమలుపై పలు కీలక సూచనలు చేశారు. ఎక్కడి నుండి ఎక్కడికి మహిళలు ప్రయాణిస్తున్నారు? ఉచిత బస్సు ప్రయాణంతో వారు ఎంత మేరకు ఆదా చేసుకుంటున్నారు? అనే సమాచారం టికెట్‌పై ముద్రించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వివరాలు ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ఉండాలని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల ఆర్‌టిసి‌పై పడే భారం తగ్గించేందుకు ఇతర ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయాలని, నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇకపై ఎసి ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని, అవసరమైన విద్యుత్‌ను ప్రభుత్వం సొంతంగా ఉత్పత్తి చేసుకునే విధానాన్ని చేపట్టాలని అన్నారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థికంగా కూడా ఆదా సాధ్యమవుతుందని తెలిపారు.