తమిళనాడు కడలూరు తీరంలో ఓ సాహస యాత్ర పెద్ద ప్రమాదంలో ముగిసింది. చెన్నైకి చెందిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు కారులో విహార యాత్రకు వచ్చారు. కొత్త ప్రదేశం కావడంతో గమ్యానికి చేరుకోవడానికి గూగుల్ మ్యాప్‌ సహాయం తీసుకున్నారు. అయితే, ఆ నావిగేషన్ వారిని రోడ్డు బదులు నేరుగా సముద్ర తీరానికి తీసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న యువకుడు ప్రియురాలు, స్నేహితులతో సవాల్ చేస్తూ వాహనాన్ని సముద్రంలోకి నడిపాడు. క్షణాల్లోనే కారు అలల్లో చిక్కుకుని కొట్టుకుపోయే స్థితికి చేరింది.

అయితే, అదృష్టవశాత్తూ సమీపంలో ఉన్న మత్స్యకారులు వెంటనే స్పందించారు. కారులో చిక్కుకున్న ఐదుగురిని ఒక్కొక్కరిని బయటకు లాగి ప్రాణాలు రక్షించారు. అనంతరం ట్రాక్టర్ సహాయంతో వాహనాన్ని కూడా సముద్రం నుంచి బయటకు తీశారు. లేదంటే ఈ ఘటన విషాదకరంగా మారేది. ఈ సంఘటన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్థానిక పోలీసులు సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు ఐదుగురినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కేరళ, రాజస్థాన్‌లో జరిగిన దుర్ఘటనలను గుర్తు చేస్తోంది. కొద్ది నెలల క్రితం రాజస్థాన్‌లో గూగుల్ మ్యాప్‌ నమ్ముకుని వాహనం నడిపిన కుటుంబం వరదలో కొట్టుకుపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ సంఘటన మరోసారి హెచ్చరికలా మారింది. గూగుల్ మ్యాప్‌లు సౌకర్యంగా ఉన్నప్పటికీ, ప్రతి దాన్ని నమ్మి వాహనం నడపడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా తీరప్రాంతాల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.