కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, విశాఖ పోర్ట్‌ నుండి కూడా బియ్యం విదేశాలకు తరలిపోతుందనే అనుమానాలపై అధికారులు గట్టి నిఘా వేశారు. ఇటీవల అక్కడ గోడౌన్‌లలో నిల్వ ఉంచిన అనుమానాస్పద బియ్యాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్‌మెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేశారు.


వెంటనే గుర్తించే రాపిడ్ కిట్లు

తనిఖీల సమయంలో అనుమానం వచ్చిన బియ్యాన్ని సాధారణంగా ల్యాబ్‌లకు పంపి పరీక్షలు నిర్వహించే ప్రక్రియలో ఆలస్యం జరుగుతుందని ఎగుమతిదారులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చింది.

పౌరసరఫరాల శాఖ ప్రత్యేక మొబైల్ రాపిడ్ టెస్టింగ్ కిట్లను రంగంలోకి దించింది. మొత్తం 700 రాపిడ్ కిట్లను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఈ కిట్లలో పొటాషియం థయోసైనైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద్రావణాలు ఉంటాయని మంత్రి వివరించారు. ప్రభుత్వం సరఫరా చేసే పోర్టిఫైడ్ రైస్ అయితే ఈ ద్రావణాలు బియ్యంపై చల్లినప్పుడు ఎరుపు రంగుకు మారుతాయి, అయితే మార్కెట్‌లో అమ్మే సాధారణ బియ్యం అయితే రంగు మారదని తెలిపారు.


తక్షణ నిర్ధారణ – సీజ్ సులభం

గతంలో అక్రమ బియ్యం పట్టుకున్న తర్వాత ల్యాబ్‌ రిపోర్టు కోసం ఎక్కువ సమయం తీసుకోవడం వలన కోర్టులో నిరూపణ కష్టమయ్యేదని మంత్రి పేర్కొన్నారు.
కానీ ఇప్పుడు ఈ రాపిడ్ టెస్టింగ్ కిట్లతో వెంటనే గుర్తించి, తక్షణ సీజ్ చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని ఆయన తెలిపారు.


శాఖలో సంస్కరణలు కొనసాగుతున్నాయని మంత్రి

పౌరసరఫరాల శాఖలో గత సంవత్సరం కాలంలో అనేక సంస్కరణలు అమలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన పోర్టిఫైడ్ రైస్ అందిస్తున్నదని, పేదల బియ్యం అక్రమ రవాణా కాకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.