అమరావతి:
ఈనెల 15, 16 తేదీల్లో సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై కీలక దిశానిర్దేశం చేయనున్నారు.

ఇటీవలే రాష్ట్రంలో పలు IAS, IPS, IFS అధికారుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించడంతో పాటు వారితో సీఎం ముఖాముఖి సమావేశమయ్యారు. ఇప్పుడు జరగబోయే కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయి. ఏడాదిన్నర పాలనలో ప్రభుత్వ పథకాల అమలు తీరు, వాటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. అలాగే శాంతిభద్రతల పరిస్థితిపై కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.

ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు కలిసి వచ్చే మూడేళ్ల అభివృద్ధి ప్రణాళికలు, ప్రజా ప్రయోజనాల దిశగా మౌలిక సదుపాయాల కల్పన, ప్రతి నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం వ్యూహాలు సిద్ధం చేయనున్నారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో జిల్లాల వారీ అవసరాలను గుర్తించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేలా సీఎం వ్యూహరచన చేస్తున్నారు.