రేపు(అక్టోబర్ 16) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది.

సంస్థ వివరాల ప్రకారం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.

దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35–45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ వంటి వాటి వద్ద నిలబడవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.