📍 మేడ్చల్, శంభీపూర్

శంభీపూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన కారు డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం ఎగిరి పక్కనే ఉన్న ఇంటి గోడపై పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో కారును కిందకు దించారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.

ఈ ఘటనతో అక్కడి వారిలో ఒకపాటి కలకలం రేగింది. భారీ శబ్దంతో బయటకు వచ్చిన స్థానికులు, కారు గోడపై ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. నిద్ర మత్తులో డ్రైవింగ్‌ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.