ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) 2026లో జరగబోయే 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత గ్రామ పంచాయతీల ఐదేళ్ల పదవీకాలం 2021 ఏప్రిల్ 3న ప్రారంభమై, 2026 ఏప్రిల్ 2న ముగియనుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243E (3)(a) ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికలు ఐదేళ్ల కాలపరిమితి ముగిసే ముందు పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ముందస్తు షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. ఇందులో పంచాయతీల విలీనం, మునిసిపాలిటీలు/నగర పంచాయతీలుగా అప్‌గ్రేడేషన్, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, రిజర్వేషన్ల ఖరారు వంటి కార్యక్రమాలు ఉన్నాయి. అక్టోబర్ 15 నాటికి పంచాయతీ విలీనం, హద్దుల నిర్ధారణకు సంబంధించిన ప్రతిపాదనలు పూర్తిచేయాలని, నవంబర్ 15లోపు వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల చేయాలని ఆదేశించారు. పోలింగ్‌ స్టేషన్ల ఖరారు నవంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది.

అదనంగా, రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ‘ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా’ ఆధారంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం 2023 జనవరి 30న ప్రత్యేక కమిటీని నియమించింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తి చేస్తే, 2026 ఏప్రిల్‌లో పదవీకాలం ముగియకముందే జనవరి నెలలోనే స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించవచ్చని స్పష్టంచేసింది.