విశాఖపట్నం: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఆయనను జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) విశాఖ యూనిట్ ప్రతినిధులు కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.

జాప్ అధ్యక్షుడు కె.ఎం. కీర్తన్, కార్యదర్శి జె.వి.కె. అప్పలరాజు నేతృత్వంలో జాప్ సభ్యులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా పక్కా గృహాల కేటాయింపు, కొత్త అక్రిడేషన్ కార్డుల మంజూరు, హెల్త్ కార్డు ప్రీమియం సిఎస్‌ఆర్ నిధుల ద్వారా చెల్లింపు, అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ వంటివి ముఖ్య డిమాండ్లుగా ఉత్థపించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ –

> “జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, గృహాలు కేటాయించే అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది. అయితే ఇంటి స్థలాల విషయంపై సుప్రీం కోర్టులో కేసు ఉన్నందున నేను ఏమి వ్యాఖ్యానించలేను. హెల్త్ కార్డు ప్రీమియం సిఎస్‌ఆర్ నిధుల నుంచి చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. వచ్చే నెల్లోనే అక్రిడేషన్ కార్డుల పంపిణీకి కృషి చేస్తాను,” అని హామీ ఇచ్చారు.

 

మంత్రిని కలిసిన వారిలో జాప్ గౌరవ సలహాదారుడు వడ్డాది ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షుడు కంచర్ల సందీప్, కార్యదర్శి వై ఎస్ ఎస్ కుమార్ (సాయి), కోశాధికారి ఎస్ ఎన్ నాయుడు, సభ్యులు కే జనార్ధన్, వెంకట్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.