మచిలీపట్నం, సెప్టెంబర్‌ 16:
కృష్ణా జిల్లా బందరు మండలంలోని తాళ్లపాలెంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్థానిక గ్రామ సచివాలయం ద్వారా జారీ చేసిన ఆదాయ సర్టిఫికెట్లపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఫోటో ఉండటంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఈ సర్టిఫికెట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ప్రభుత్వం మారినా, పాత ప్రోఫార్మాలే వాడటమే ఈ లోపానికి కారణమని అధికారులు గుర్తించారు. దీనిపై మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) తక్షణ విచారణ చేపట్టి సిబ్బందిని ప్రశ్నించారు. నిర్లక్ష్యం చేసినట్లు తేలడంతో సదరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కొత్త ప్రోఫార్మాలతోనే సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకూడదని సిబ్బందికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.