అమరావతి: రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో మొదలుకానున్నాయి. ఈ సమావేశాలు మూడు నుంచి ఐదు రోజుల వరకు మాత్రమే కొనసాగవచ్చని సమాచారం. కారణం – ఇదే సమయంలో విజయవాడలో దేవి శరన్నవ రాత్రులు, తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరగడం వల్ల భద్రతా సిబ్బందిలో కొరత ఏర్పడింది.
వైసిపి వ్యూహం
ఈ సారి వైసిపి ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలి రోజు సభలో పాల్గొని అనంతరం వాకౌట్ చేసే యోచనలో ఉన్నారని సమాచారం. అయితే వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. మిగిలిన రోజుల్లో పార్టీ ఎటువంటి వ్యూహం అవలంబించబోతుందన్నది కూడా ఆసక్తికర చర్చగా మారింది. వైసిపి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, రైతులకు యూరియా కొరత, ఉల్లి, టమాటాలకు గిట్టుబాటు ధర లేకపోవడం, కరేడు భూ సేకరణ, అమరావతి రెండో దశ భూ సమీకరణ, వికలాంగుల పింఛన్ల కోతలపై మండలిలో చర్చించనుంది.
అధికార కూటమి సన్నాహాలు
ప్రభుత్వం తరఫున టిడిపి, జనసేన, బిజెపి సభ్యులు అభివృద్ధి అంశాలను ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలవుతున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డీఎస్సీ వంటి సంక్షేమ పథకాల గురించి సభలో ప్రస్తావించనున్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పులను కూడా ఎత్తిచూపేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రవేశపెట్టే బిల్లులు
ఈ సమావేశాల్లో ఐదు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పు) చట్టం – 2006 (నాలా యాక్ట్) రద్దు చేసే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా సిఆర్‌డిఎ పరిధిని మినహాయించి, రాష్ట్రంలోని స్థానిక సంస్థల పరిధిలో ఆగస్టు 31, 2025 వరకు నిర్మించబడిన అనధికార భవనాలను క్రమబద్ధీకరించేందుకు డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ లేదా బిల్లు రావచ్చు.
భద్రతా సమీక్ష
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై శాసనమండలి చైర్మన్ కె. మోషేన్‌రాజు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, డిజిపి హరీష్‌కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి పాల్గొన్నారు.
పార్టీ సమావేశాలు
వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇందులో ప్రజా సమస్యలు, రాజకీయ వ్యూహాలు చర్చించనున్నట్లు పార్టీ ప్రకటించింది. మరోవైపు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉదయం 8 గంటలకు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, పసుపు దుస్తులు, సైకిల్ గుర్తు ఉన్న కండువాలతో అసెంబ్లీకి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది