ఆంగన్‌వాడీ వర్కర్లు (AWWs), హెల్పర్లు (AWHs) సమాజంలో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, తల్లులకు కీలక సేవలను అందించే ప్రథమ శ్రేణి సిబ్బంది అని మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. వీరు ప్రధానంగా చిన్నారుల పోషకాహారం, కౌన్సెలింగ్, ప్రారంభ విద్య, ఆరోగ్య సహకారం వంటి సేవలకే అంకితమై ఉండాలని, వీరిని పెన్షన్ పంపిణీ వంటి సంబంధం లేని పనులకు వినియోగించరాదని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

డైరెక్టర్ అడపాల సూర్యకుమారి IAS పేర్కొంటూ, ఆంగన్‌వాడీ సెంటర్ల పనివేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని, అనంతరం వీరు గృహ సందర్శనలు చేసి పిల్లల సంరక్షణ, తల్లుల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఈ సమయంలో లేదా అనంతరం ఇతర పనులకు వినియోగించడం వల్ల వారి శారీరక సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా సెంటర్ల సాధారణ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని చెప్పారు.

అందువల్ల, ఆంగన్‌వాడీ వర్కర్లు మరియు హెల్పర్లను వారి విధులకు సంబంధం లేని ఇతర పనులకు ఉపయోగించరాదని సంబంధిత అధికారులకు డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పిల్లల ప్రారంభ విద్య, పోషకాహారం, ఆరోగ్య సహకారం వంటి ప్రాథమిక బాధ్యతలకే వారిని వినియోగించాలని సూచించారు.