దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ఆధునికీకరించేందుకు కేంద్ర విద్యుత్ శాఖ ఆధార్ తరహాలో వినియోగదారులకు ప్రత్యేక గుర్తింపు నంబర్ (Unique ID) కేటాయించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యుత్ పంపిణీ మరియు సరఫరా వ్యవస్థల్లో సంస్కరణలపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యుత్ కనెక్షన్ల సంఖ్యలు రాష్ట్రానికో విధంగా ఉండటం వల్ల, ఎక్కడ ఎంత వినియోగం జరుగుతోంది అనే విషయాన్ని సమగ్రంగా గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వినియోగానికి సరైన అంచనాలు వేసే అవకాశం తగ్గిపోతున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగానికి ప్రత్యేక ఐడీ నంబర్లు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.
తాజా గణాంకాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 430.49 బిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 3.6 శాతం అధికం. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు విద్యుత్ వ్యవస్థలో విభాగాల మధ్య సమన్వయం మరింత క్లిష్టంగా మారుతోంది.
ఎక్కడి నుంచైనా వినియోగం పర్యవేక్షణ
ఒకే విధమైన గుర్తింపు నంబర్లతో వినియోగదారులు దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించుకోవచ్చు. తమ ఇంటి, వ్యవసాయ క్షేత్రం లేదా పరిశ్రమలో విద్యుత్ వాడకాన్ని ఆన్లైన్లో పరిశీలించేందుకు వీలు ఉంటుంది. అలాగే ఆన్‌లైన్ బిల్లింగ్, సేవల పర్యవేక్షణ, ఇతర సంబంధిత సమాచారం కూడ ఒక్క చోటే లభించేలా సాంకేతిక వ్యవస్థ రూపుదిద్దుకోనుంది.