అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్‌ యూనివర్సిటీలో శనివారం మూడు శాటిలైట్లను విజయవంతంగా ప్రయోగించారు. కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకుల ఆవిష్కరణగా ఈ ప్రయోగం నిలిచింది.

కేఎల్‌ జేఏసీ, కేఎల్‌ శాట్‌–2, కాన్‌శాట్‌ పేరిట మూడు శాటిలైట్లు రూపొందించి ఉదయం 5.30 గంటలకు ప్రయోగించారు. డ్రోన్‌ సాయంతో కేఎల్‌ శాట్‌–2ను అంతరిక్షంలోకి పంపగా, ఇది స్పెక్ట్రోమీటర్‌ సాయంతో పర్యావరణ సంబంధిత సమాచారం సేకరించనుంది.

కాన్‌శాట్‌ ఉపగ్రహం వాతావరణ పరిస్థితులు, వాయు నాణ్యతపై అధ్యయనం చేయనుంది. ఈ ఉపగ్రహం "మేక్‌ ఇన్‌ ఇండియా", "ఆత్మనిర్భర్‌ భారత్‌" పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపికైనది.

కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. శాటిలైట్ల ఆవిష్కరణలో విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు.