2047 నాటికి భారత్‌ ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, అదే దిశగా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

శుక్రవారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో శశిధర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నందగోకులం లైఫ్‌ స్కూల్‌, సేవ్‌ ది బుల్‌, విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్‌ ప్లాంట్‌లను సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విశాఖపట్నంలో రూ.88 వేల కోట్లతో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటవుతోందని తెలిపారు.

24 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఇథనాల్‌ ప్లాంట్‌ రోజుకు 200 కిలోలీటర్ల ఉత్పత్తి చేస్తోందని, దీని కోసం పాడైన బియ్యం, నూకలు, పంట వ్యర్థాలను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు లాభం కలుగుతోందన్నారు.

రైతులు, పర్యావరణం, విద్యార్ధుల సంక్షేమానికి దోహదం చేసే మూడు వినూత్న ప్రాజెక్టులు ప్రారంభించిన చింతా శశిధర్‌ ఫౌండేషన్‌‌ను సీఎం అభినందించారు. నెల్లూరు జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధి వేగం మరింత పెంచుతామని తెలిపారు.