సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధికి ముందు నుంచే ప్రణాళికలు చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. గద్దెల మార్పుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడారం మహాజాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం అభివృద్ధిని విస్మరించారని, కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే జాతరకు ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధి పనులను స్వయంగా సమీక్షిస్తున్నారని సీతక్క అన్నారు.

మేడారం గద్దెల దగ్గర మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. తాము, పూజారులు చేసిన మార్పులపై సీఎం రేవంత్ సంతృప్తి చెందలేదని. అందుకే ఆయనే స్వయంగా గద్దెల దగ్గరకు వస్తున్నారని వివరించారు. ఈ నెల 13న లేదా 14న సీఎం మేడారం పర్యటనకు వస్తారని తెలిపారు.

అయితే, గద్దెల మార్పుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజారులు, భక్తుల మనో భావాలు దెబ్బతినకుండా మార్పులు చేస్తామన్నారు. మేడారం జాతరపై రాజకీయం చేయవద్దని, భక్తి భావంతో చూడాలని సూచించారు. మహాజాతర సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా మార్పులు చేస్తున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు.